శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఘనంగా ఓరియెంటేషన్ కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్
రాయచోటి, జూలై 13(జానం న్యూస్):
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని **శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్)**లో సోమవారం మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థినీ, విద్యార్థుల కోసం ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, విశిష్ట అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కె. రమేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలన అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం, ఈవ్ టీజింగ్ వంటి చట్టవిరుద్ధమైన, అనాగరిక చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.

రూరల్ సీఐ చలపతి మాట్లాడుతూ విద్యార్థులు విద్యనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదివి తమ కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. క్రిమినల్ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కె. రమేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. విద్యార్థి దశలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతర అధ్యయనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అపజయాలను చూసి నిరుత్సాహపడకుండా వాటిని విజయానికి సోపానాలుగా మలుచుకోవాలని, మంచి ఆలోచనలు, సానుకూల దృక్పథం, నిరంతర శ్రమతో జీవితంలో ఆశించిన శిఖరాలను చేరుకోవచ్చని ప్రేరణనిచ్చారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావంతో మెలుగుతూ, సాంకేతిక నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న సిద్ధాంతాలను ప్రయోగశాలల్లో ఆచరణాత్మకంగా అవగాహన చేసుకోవాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, స్మార్ట్ స్కిల్స్‌లో ప్రావీణ్యం సాధించి తమ లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి అనంతరం తీసుకునే నిర్ణయాలే విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశిస్తాయని పేర్కొన్నారు.
పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు చిన్న వయస్సులోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు. రైల్వే, ఆర్మీ, గెయిల్, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బెల్, మహారత్న, నవరత్న సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని రోడ్లు & భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా నిర్మాణ, ఆటోమొబైల్, పవర్ ప్లాంట్స్, తయారీ, కమ్యూనికేషన్ తదితర ప్రైవేట్ రంగాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. గత రెండు దశాబ్దాలుగా శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని తెలిపారు.
పాలిటెక్నిక్ ఇన్‌చార్జ్ వి. ప్రతాప్ రావు మాట్లాడుతూ రాయచోటి పరిసర మండలాల నుంచి విద్యార్థుల రాకపోకలకు కళాశాల బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. అదనంగా అర్థమెటిక్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఆధునిక డిజిటల్ లైబ్రరీతో పాటు బాలురు, బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జహీర్, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ పి.వి. సుధాకర్ రెడ్డి, శక్తి, ఈగల్ టీం సిబ్బంది, కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఏ. నరేష్, మేనేజ్‌మెంట్ & ప్లేస్‌మెంట్స్ విభాగాధిపతి డాక్టర్ కె. ఇంతియాజ్, ఏఐ & డీఎస్ విభాగాధిపతి పి. సుబహాన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి వి. ప్రతాప్ రావు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పి. శ్రావణ్ కుమార్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి బి. సౌజన్య, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఏ. కరుణాకర్, బేసిక్ సైన్సెస్ & హ్యూమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ ఎన్. నాగేంద్ర, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

