వీరబల్లి, సెప్టెంబర్ 26(జానం న్యూస్):
వీరబల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అనగాని రామ్మోహన్‌కు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెడ్డయ్య ఆధ్వర్యంలో శనివారం ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రెడ్డయ్య మాట్లాడుతూ అనగాని రామ్మోహన్ చక్కటి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ, తన సమయాన్ని వృథా చేయకుండా విద్యార్థులకు తెలుగు భాషను ఆసక్తికరంగా, చక్కగా బోధించేవారని తెలిపారు. బోధనతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారని పేర్కొన్నారు.

విద్యార్థుల పుట్టినరోజులను సైతం సృజనాత్మకంగా నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థి చేత మొక్కలు నాటించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహించేవారని తెలిపారు. పాఠశాలలో పనిచేస్తున్న వంట మనుషులు, ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌లకు కొత్త బట్టలు పంపిణీ చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారని రెడ్డయ్య కొనియాడారు.
సన్మానానికి స్పందించిన అనగాని రామ్మోహన్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో విద్యార్థిగా చేరి, అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించి, చివరకు ఇదే పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. తన ఎదుగుదలలో పాఠశాల, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందించిన సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు.

ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కొంతమంది ఉపాధ్యాయులు అవార్డుకు పేరు తెస్తే, రామ్మోహన్ వంటి ఉపాధ్యాయులు అవార్డుకే గౌరవం తీసుకొస్తారని ప్రశంసించారు. ఆయన సేవలు ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
అనంతరం రామ్మోహన్‌ను ప్రధానోపాధ్యాయుడు రెడ్డయ్య, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

