Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

36 ఏళ్ల విశిష్ట సేవలకు ముగింపు.. ఘనంగా పదవీ విరమణ పొందిన ఎనుముల జయమ్మ

36 ఏళ్ల విశిష్ట సేవలకు ముగింపు.. ఘనంగా పదవీ విరమణ పొందిన ఎనుముల జయమ్మ

వనపర్తి, జూలై 21(జానం న్యూస్):
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా విద్యారంగంలో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన ప్రముఖ ఉపాధ్యాయిని ఎనుముల జయమ్మ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని దక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఆమెకు ఘనంగా పదవీ విరమణ సన్మానోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శిష్యులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఎనుముల జయమ్మ 1989 సంవత్సరంలో స్పెషల్ టీచర్‌గా ప్రభుత్వ విద్యాశాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యతనిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. అనంతరం ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయినిగా బాధ్యతలు నిర్వహించి విశిష్ట సేవల అనంతరం పదవీ విరమణ పొందారు.

Oplus_16908288

ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పాటల కచేరీలో ఎనుముల జయమ్మ స్వయంగా తన మధుర గాత్రంతో పలు గీతాలను ఆలపించి సభికులను అలరించారు. ఆమె గాన ప్రతిభకు హాజరైన వారందరూ ప్రశంసలు కురిపిస్తూ ఘనంగా అభినందించారు.
.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తకోట మండల విద్యాశాఖ అధికారి జే. కృష్ణయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, ఎనుముల జయమ్మ తన ఉద్యోగ జీవితమంతా విద్యార్థుల అభివృద్ధి, పాఠశాలల పురోగతి కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం, నైతిక విలువలను బోధించడం ద్వారా ఆదర్శ ఉపాధ్యాయినిగా నిలిచారని అన్నారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజ సేవకు కొత్త ఆరంభమని పేర్కొంటూ ఆమె ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

పదవీ విరమణ పొందుతున్న ఎనుముల జయమ్మ భావోద్వేగంతో మాట్లాడుతూ, 36 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తనకు సహకరించిన విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి తన జీవితానికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, విద్యార్థుల ప్రేమాభిమానాలే తనకు గొప్ప సంపదగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా విద్య, సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు సేవలను కొనసాగిస్తానని తెలిపారు.

అనంతరం ఎనుముల జయమ్మ, ఆమె భర్త టి. సుదర్శన్ రెడ్డి దంపతులను శాలువాలతో సత్కరించి, పూలహారాలు వేసి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. సభలో పలువురు ఉపాధ్యాయులు, సహచరులు, శిష్యులు జయమ్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె సేవలను కొనియాడారు. ఆమె భవిష్యత్ జీవితం ఆనందమయం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి. వివేకానంద, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎనుముల జయమ్మ సోదరుడు ఎనుముల హేమసుందర్ రెడ్డి, వదిన భారతి రెడ్డి, మేనల్లుడు దినేష్ రెడ్డి , కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచర ఉపాధ్యాయులు, శిష్యులు మరియు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని పదవీ విరమణ పొందిన జయమ్మ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం సమర్పణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Major Red Sanders Smuggling Bid Foiled in Tirupati; Contraband Worth ₹16 Lakh Seized

పీలేరు శ్రీ భువన విద్యాలయం విద్యార్థులకు జవహర్ నవోదయలో ప్ర‌వేశం – ‘శ్రీ భువన విద్యాలయం’కు గర్వకారణమైన ఘనత

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment