పర్యావరణాన్ని కాపాడితేనే భావితరాలకు పచ్చని భూమి అందుతుంది: డాక్టర్ బత్తుల సంజీవరాయుడు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో అవగాహన ర్యాలీ
నంద్యాల, జూన్ 5 (జానం న్యూస్): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్రకృతిని రక్షించడం ద్వారా మాత్రమే భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని భూమిని అందించగలమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు అన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుండి షెఫర్డ్ సొసైటీ అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో, ఎంఈపీఎంఏ శాఖ సహకారంతో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా సంజీవరాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమేనని తెలిపారు. గాలి, నీరు, భూమి, వృక్షజాలం, జంతుజాలం వంటి సహజ వనరుల సమాహారమే పర్యావరణమని, జీవకోటి మనుగడకు అది మూలాధారమని పేర్కొన్నారు.
ప్రస్తుతం మానవుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల విచక్షణారహిత నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, పరిశ్రమల వ్యర్థాలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా భూతాపం, వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చాయని తెలిపారు. ఈ పరిస్థితి మానవ ఆరోగ్యంతో పాటు సమస్త జీవరాశులకు ముప్పుగా మారుతోందన్నారు.
పర్యావరణ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సంజీవరాయుడు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, విరివిగా మొక్కలు నాటడం, నీరు, విద్యుత్, పెట్రోలు, డీజిల్ వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు.
“పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని సంరక్షించడం ద్వారా మాత్రమే సురక్షితమైన భవిష్యత్తును నిర్మించగలం. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని ఆయన పేర్కొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న వారు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బర్నబాస్, లక్ష్మీదేవి, అరుణ, స్వాతి, రిక్వానంద రెడ్డి, శివరాం రెడ్డి, నార్ల ప్రకాశం, సుందర్, సుబ్బయ్య, జాన్, తేజోమయం తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

