చిత్తూరులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
చిత్తూరు, జూన్ 21(జానం న్యూస్):
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ కేంద్రం, చిత్తూరు జిల్లా పరిపాలన సమన్వయంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. “ఒక భూమి – ఒక ఆరోగ్యం కోసం యోగా” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సేవకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు..

ఉదయం నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ యోగా దినోత్సవాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక, ఆరోగ్య సంపద అని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి వ్యాధులను అధిగమించేందుకు యోగా సమర్థవంతమైన సాధనమని తెలిపారు. ప్రతి కుటుంబంలో యోగా దినచర్యగా మారాలని, యువత యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగగలరని అన్నారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీ మోహన్ మాట్లాడుతూ, యోగా మానవాళికి భారతదేశం అందించిన అపూర్వమైన బహుమతిగా అభివర్ణించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి విద్యాసంస్థలో యోగా శిక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్. మనోహర్ మాట్లాడుతూ, యువతలో యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తి సంతోషకరమని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఉత్తమ మార్గమని తెలిపారు. యోగా ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు.

ఆయుష్ శాఖకు చెందిన డా. గోవిందయ్య యోగా యొక్క వైద్యపరమైన ప్రయోజనాలను వివరిస్తూ, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో చిత్తూరు మై భారత్ అకౌంట్స్ ఆఫీసర్ ఎంసీ బాబు రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొని యోగా దినోత్సవ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. మై భారత్ కేంద్రానికి చెందిన యోగ గురువు శ్రీనివాసులు నాయుడు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం, వజ్రాసనం, ప్రాణాయామం తదితర యోగా ప్రక్రియలను పాల్గొన్న వారికి అభ్యసింపజేశారు.

మై భారత్ వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
జిల్లాలో యోగా పట్ల అవగాహన పెంపొందించడం, యువతలో ఆరోగ్య చైతన్యం కల్పించడం, భారతీయ సంస్కృతిలో యోగా ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

