Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు జాగ్రత్తలు పాటించాలి

కలికిరి, మార్చి 13 (జానం న్యూస్): దేశంలో మార్చి నుంచి మే 2026 వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిందని కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సమన్వయకర్త డాక్టర్ కే. మంజుల ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, మార్కాపురం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి ప్రభావం అధికంగా ఉండే అవకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలకు నష్టం కలగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. పంటలకు నీటిని ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇవ్వడం మంచిదని తెలిపారు. స్ప్రింక్లర్ లేదా రైన్ పైప్ వ్యవస్థల ద్వారా నీటిని అందించడం వల్ల మొక్కలపై చల్లదనం ఏర్పడి వేడి ప్రభావం తగ్గుతుందని వివరించారు.

పొలాల్లో గడ్డి లేదా పంట వ్యర్థాలను పరిస్తే నేలలో తడి ఎక్కువకాలం నిల్వ ఉండి నీరు త్వరగా ఆవిరి కాకుండా ఉంటుందని చెప్పారు. అలాగే చివికిన పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రీయ ఎరువులను ఉపయోగించడం వల్ల నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి మొక్కలు బలంగా పెరుగుతాయని సూచించారు.

Oplus_16908288

సమస్యాత్మక కలుపు మొక్క అయిన పార్థీనియం (ముక్కుపూల మొక్క) పొలాల్లో లేకుండా చూసుకోవాలని, కనిపించిన వెంటనే తొలగించి నాశనం చేయాలని రైతులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పచ్చదోమ, పేను, తామర పురుగులు, తెల్ల దోమ, మైట్ వంటి రసం పీల్చే పురుగుల ప్రబలత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటి నియంత్రణ కోసం వేప కొమ్మల ద్రావణం లేదా వేపనూనె (10000 పీపీఎం) లీటరు నీటికి 1 మిల్లీ లీటర్ చొప్పున కలిపి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే ఎకరాకు 20 నుంచి 30 పసుపు లేదా నీలం రంగు జిగురు అట్టలను అమర్చడం ద్వారా చీడపీడలను నియంత్రించవచ్చని తెలిపారు.

వరి పంటలో ఎకరాకు 8 నుంచి 10 కిలోల అజోల్లాను ఉపయోగించడం ద్వారా పంటకు సహజ నత్రజని అందించడంతో పాటు నీటి అవసరం కూడా తగ్గుతుందని వివరించారు. అదేవిధంగా పంటలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు పొటాషియం నైట్రేట్ (13:0:45) లేదా 19:19:19 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి ఒకసారి పిచికారీ చేయాలని సూచించారు.

తోట పంటలలో ముఖ్యంగా మామిడి తోటల్లో పెరుగుతున్న కాయలకు ఫ్రూట్ కవర్లు కట్టడం వల్ల అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గి కాయల నాణ్యత కాపాడబడుతుందని తెలిపారు. అలాగే బొప్పాయి, టమాట, మిరప మరియు పూల తోటలలో నేల ద్వారా సంక్రమించే వేరుకుళ్ళు వ్యాధులను నివారించేందుకు ట్రైకోడెర్మా, సూడోమోనస్ వంటి జీవ శీలింధ్రనాశకాలను ఎకరాకు 1 నుంచి 2 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా లేదా పేడ ఎరువులో కలిపి ఉపయోగించాలని సూచించారు.

అదనంగా కాయలు, కొమ్మలను దెబ్బతీసే గొంగళి పురుగులను నియంత్రించేందుకు స్పైనోసాడ్, స్పైనటోరమ్ వంటి పర్యావరణ హిత మందులను ఉపయోగించాలని రైతులకు సూచిస్తున్నట్లు డాక్టర్ కే. మంజుల పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యం:కుప్పం రవిచంద్రా రెడ్డి,నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ యజమాని.

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిత్తూరులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

గండబోయనపల్లిలో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment