Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

​పాఠశాల రూపురేఖలు మార్చి.. బోధనలో ఆదర్శంగా నిలిచి: ఉత్తమ ఉపాధ్యాయినిగా పులుపుతూరి సుజాత

మదనపల్లె, సెప్టెంబర్ 5(జానం న్యూస్ ):

ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రామాపురం మండలం బీసీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని పులుపుతూరి సుజాత ప్రతిష్ఠాత్మక ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని’ అవార్డును అందుకున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ భాష, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

రాయచోటి మండలం దూళ్లవారిపల్లె గ్రామానికి చెందిన పులుపుతూరి వెంకటరమణ, నారాయణమ్మ దంపతుల ద్వితీయ పుత్రిక సుజాత. చిన్ననాటి నుంచే విద్యపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆమె, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల అభివృద్ధికి విశేష కృషి చేశారు.

2010లో వృత్తి ప్రస్థానం – మైలురాళ్లు

సుజాత 2010 నవంబర్ 4న సుండుపల్లి మండలం వావిలఒడ్డు బిడికి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ 11 సంవత్సరాల పాటు సేవలందిస్తూ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తుల మన్ననలు పొందారు.

ప్రభుత్వం ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించకముందే, ఆమె సొంత చొరవతో వావిలఒడ్డు బిడికి పాఠశాలకు గేటు, నేమ్‌బోర్డు వంటి మౌలిక వసతులు సమకూర్చి, ఆహ్లాదకరమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించారు.

రామాపురం మండలంలో విద్యా సేవలు

2021 జనవరి 14 నుండి రామాపురం మండలం బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో సేవలందిస్తున్న సుజాత, కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకతపై దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

కుటుంబ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు

పురస్కారం అందుకున్న సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడైన తన భర్త శ్రీనివాసుల నిరంతర ప్రోత్సాహం, వెన్నుదన్నుగా నిలవడం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారమే తన విజయానికి కారణమని, ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు.

ప్రముఖుల అభినందనలు

జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికైన పులుపుతూరి సుజాతను విద్యాభిమానులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు అభినందించారు. ఈ గౌరవం పాఠశాలకు, ప్రాంతానికి ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

మదనపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

అవశేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాను: జామకాయల కృష్ణమూర్తి

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఘనంగా పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment