జానం న్యూస్, పీలేరు, నవంబర్ 23: గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6,7,8 తరగతుల విద్యార్థులకు అభ్యసనాభివృద్ధి కార్యక్రమం పై తెలుగు, ఆంగ్లం, గణిత శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల ఉపాధ్యాయులకు మూడవ రోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి పరిశీలికులుగా పీలేరు మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి, కె.వి పల్లి మండల విద్యాశాఖ అధికారి పి.రెడ్డిభాష,కోర్స్ డైరెక్టర్ గా వి.జి నటరాజన్ వ్యవహరించారు.ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కనీస అభ్యసనాస్థాయిని విద్యార్థుల్లో అభివృద్ధి చేయడం, బోధన పీరియడ్స్ తో పాటు సాధన పిరియడ్స్ ను కేటాయించడం, భాషా నైపుణ్యాలను పెంపొందించడం, అహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ఈ శిక్షణ ఉద్దేశమని అన్నారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో విద్యార్థుల అభ్యాసన మెరుగుపరిచేందుకు పకడ్బందీగా అమలు చేస్తేనే ఈ శిక్షణకు సార్థకత అన్నారు.
విద్యార్థుల్లో అభ్యాసన పేదరికాన్ని రూపుమాపినప్పుడే విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చునని సూచించారు.లిప్(లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమం ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 10 జిల్లా లలో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం 2027 సంవత్సరం వరకు కొనసాగుతుందని అన్నారు. రాజన్న,వాణిశ్రీ (తెలుగు), ప్యారుఖాన్, కృష్ణయ్య (ఆంగ్లం), రెడ్డి ఆంజనేయులు, ఏ.కృష్ణవేణి(గణితం), సుధాకర్, శివశంకరయ్య (జీవ శాస్త్రం), వెంకట శివయ్య (భౌతిక శాస్త్రం), నారాయణ, ముని వెంకట్రామయ్య(సాంఘిక శాస్త్రం) రిసోర్స్ పర్సన్స్ గా పాల్గొని శిక్షణ ఇచ్చారు. పీలేరు, కె.వి పల్లి మండలాల నుండి ప్రభుత్వ, జిల్లా పరిషత్, గురుకుల, ఆదర్శ పాఠశాలల నుండి తెలుగు, ఆంగ్లం, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సోషియల్ సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






